Parnasala Bhadrachalam, Kinnerasani Deer Park and Kinnerasani Dam - పర్ణశాల, కిన్నెరసాని జింకల పార్క్ మరియు కిన్నెరసాని డ్యామ్

ఇప్పుడు మీరు చదవబోయె విహారయాత్ర పర్ణశాల, సీతమ్మ నార చీరల స్థలం, కిన్నెరసాని జింకల పార్క్ మరియు కిన్నెరసాని ఆనకట్ట.

పర్ణశాల

భద్రాచలం సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే. ఈ పుణ్యక్షేత్రం, రాములవారి గుడి, రామదాసు అని పిలువబడే కంచెర్ల గోపన్న చరిత్రం. ఉగాది ముందు రామనవమి దాకా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే తిరునాళ్లు చాలా ప్రసిద్ధి. ప్రతి ఏడాదిలాగే ఈ రామనవమికి కూడా భద్రాచలం సిద్ధమవుతోంది. సీతారాములవారి కల్యాణం బ్రహ్మానందమైన ఒక విశేషం.

రామనవమి సంబరాలు, భద్రాచలం నుండి ప్రవహిస్తున్న గోదావరి, ఇవన్ని తెలిసినవే! వీటిని మించిన ప్రదేశం మరొకటి ఉంది. పర్ణశాల భద్రాచలం యొక్క ముఖ్యమైన మరియు అద్భుతమైన సందర్శనా స్థలం. పర్ణశాల తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ గ్రామం. భద్రాచలం నుండి 32 కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉన్నది. భద్రాచలం రోడ్డు ద్వారా హైదరాబాద్ నుండి సుమారు 305 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం రాముడి పురాణం కారణంగా రామభక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. సీతారాముల దేవస్థానం ఎంతటి ప్రఖ్యాతి చెందినదో ఈ పర్ణశాలకు కూడా అంతే ప్రఖ్యాతి చెందింది. పర్ణశాల వెళితే మొదట మనకు అనిపించేది ఏమిటంటే దీనికి రావల్సినంత గుర్తింపు రాలేదేమో అని.

భద్రాచలం నుండి షేర్ఆటో లేక టాక్సీల ద్వారా పర్ణశాల చేరుకోవచ్చు. ప్రభుత్వం నడిపే బస్సులు కూడా ఉన్నాయి. నవంబరు-ఫిబ్రవరి కాలంలో పర్ణశాలకు భద్రాచలం నుంచి పడవలో కూడా వెళ్లవచ్చు. అప్పుడు గోదావరి నదిలో నీటిప్రవాహం బాగుంటుంది కాబట్టి. రామనవమి సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పడవలుండవు.

పర్ణశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని ఉంది. రాముడు వనవాసం చేసిన 14 సంవత్సరాలలో, రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణ్తో కలిసి ఈ గ్రామంలోనే ఉండేవాడని నమ్ముతారు. రాముడు, సీత, లక్ష్మణుడితో వనవాసానికి బయల్దేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరుచుకొని ఉన్నారు. అదే ఈ పర్ణశాల. ఇక్కడ ప్రతి రాయికి, ప్రతిగుట్టకు ఓ చరిత్ర ఉంది. మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుండే రావణాసురుడు సీతమ్మని అపహరించాడట. రాముడి జీవితంలోని దుక్కాన్ని వర్ణించే ఈ ప్రదేశాన్ని శోకరామ అని కూడా అంటారు. పర్ణశాలలోని ఒక చిన్న గుడిసెలో రాముడు, సీత మరియు లక్ష్మణుల అందంగా చిత్రించిన శిల్పాలు ఉన్నాయి.

సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోని చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. పర్ణశాల గ్రామం శ్రీరాముని పురిటి నొప్పులను వర్ణిస్తుంది. రావణుడు సీతను అపహరించిన సమయం. సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధ గుట్టపై’ చీర ఆరేసుకుంది అని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పట్టణం చుట్టూ రాముడు బస చేసిన జాడలను వర్ణించే పాదముద్రలు కూడా ఉన్నాయి. అలాగే, సీతను అపహరించిన రావణుడి రథం యొక్క బంగారు జింక మరియు చక్రాల పాదముద్రలు ఉన్నాయి. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇక్కడ ఇప్పుడు  కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి.  రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక స్థలాలు.

పురాణాల ప్రకారం, అత్యంత క్రమశిక్షణ కలిగిన శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాతవాసంలో కొంత భాగాన్ని ఈ ప్రదేశంలో గడిపాడు. గ్రామానికి సమీపంలో ఒక వాగు ఉంది మరియు ఈ ప్రవాహంలో సీత దేవి స్నానం చేసి తన బట్టలు ఉతుకుతుందని స్థానికులు నమ్ముతారు. ఈ పురాణం యొక్క రుజువు స్థలంలో లభించిన ముద్రలలో స్పష్టంగా కనిపిస్తుంది. సీతాదేవి నదిలో స్నానం చేసిందనే నమ్మకానికి ఈ చిన్న ప్రవాహం సాక్ష్యంగా నిలుస్తుంది, ఈ ప్రాంతాన్ని సీతవాగు అంటారు. పర్ణశాలలో వెలసిన రామాలయాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు నిత్యం వస్తుంటారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితేచాలు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు వాగు, ఇంకోవైపు కొండలతో ఈ ఊరు సౌందర్యానికి ప్రతీకలా ఉంటుంది. 

వాగు పక్కనే ఉన్న కొండ చరియలు అనేక రంగులతో కళాత్మకంగా ఉంటాయి. సీతమ్మవారు అక్కడ పసుపు కుంకుమల కోసం కొన్ని రాళ్ళను వాడేదని, అందుకే ఆ రంగు రంగుల కొండ రాళ్ళు మరింత శోభను సంతరించుకున్నాయని అంటారు. సీతమ్మ, రామయ్యలు తిరిగిన ఈ ప్రదేశాన్ని చూట్టానికి దేశం నలుమూలల నుండీ భక్తులు విస్తారంగా వస్తుంటారు.

సీతమ్మ దుస్తులు ఆరబెట్టుకున్న చోటు, నగలు ఉంచిన ప్రదేశం, పసుపు కుంకుమలకు ఉపయోగించిన రాళ్ళు అంటూ ఒక్కో రాయినీ, ప్రదేశాన్నీ స్థానికులు చూపిస్తుంటే భక్తుల సంతోషానికి అవధులు ఉండవు.

పర్ణశాలలోని "రాధగుట్ట"లో ఉన్న ముద్రలు అటువంటి సాక్ష్యం. ఈ చారిత్రక గ్రామం యొక్క చరిత్రకు సంబంధించిన మరో కథ ఏమిటంటే, సీతాదేవిని మోసం చేయడానికి బంగారు జింక రూపంలో మారీచ రాక్షసుని శ్రీరాముడు అదే ప్రదేశంలో చంపాడు.

అక్కడి స్థానికుల కథనం ప్రకారం రావణాసురుడు తన పుష్పకవిమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడట. గోదావరి ఒడ్డున తన వాహనాన్ని ఆపి, సన్యాసి అవతారం ధరించి, పర్ణశాలకు వచ్చి, సీతమ్మవారిని అపహరించాడట. ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాములవారిని ఆ జింక కావాలని కోరిందిట. శ్రీరాముడు బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుని సంహరించాడట.

ప్రస్తుతం పర్ణశాల, ఈ విశేషాలు చూడటానికి వచ్చిన పర్యాటకులు, వారు చేసే వ్యాపారం మీదే ఆధారపడి ఉంది. ఆ ఊరి పంచాయతి వారు సమగ్రంగా ఈ ప్రత్యేకతను వాడుకుంటున్నారు. ఊరి మధ్యలోనే ప్రతి వాహనంపై పన్ను సేకరిస్తున్నారు. పర్ణశాల కుటీరం పక్కనే సీతారాముల వారి చిన్న గుడి కూడా ఉంది.

పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు, కుటీరం ఏర్పాటుచేశారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు. ప్రభుత్వం పర్ణశాలను ప్రత్యేక కేంద్రంగా గుర్తించి బాపు గారిని ఆహ్వానించి రామాయణంలో ఇక్కడి ఘట్టాన్ని బొమ్మల రూపంలో రూపొందించమని కోరింది. ఈ బొమ్మలు బాపు శైలిలో ఆకర్షణీయంగా ఉన్నాయి.


కిన్నెరసాని జింకల పార్క్

ఇప్పుడు మీరు చదువుతున్న కిన్నెరసాని జింకల పార్క్ పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలో ఏర్పాటుచేసి ఇప్పటికి 48 సంవత్సరాలు పూర్తయింది. పాల్వం చ మండలంలోని యానంబైల్ గ్రామ పంచాయతీ కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో 30 జింకలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ను 1974 సెప్టెంబర్ 29 తేదీన అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గారు ప్రారంభించారు. అప్పటినుంచి సింగరేణి యాజమాన్యం దీనిని పర్యవేక్షిస్తూ వచ్చింది. పర్యాటకులకోసం కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన అద్దాల మేడను 2000 సంవత్సరంలో మావోయిస్టులు డిటోనేటర్ల ద్వారా పేల్చి వేసారు. దాంతో అద్దాలమేడ, పది కాటేజీలు మరియు జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వన్యమృగ సంరక్షణ అధికారులకు అప్పగించారు.

అప్పటి నుంచి వన్యప్రాణుల అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి జింకల పార్క్ను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 30 జింకలు ఉండగా క్రమక్రమం గా అధికారులు పార్క్ విస్తీర్ణం పెంచి 110 జింకలకు పెంచారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపించే కృష్ణ జింకలు కిన్నెరసాని రిజర్వాయర్కు వచ్చే పర్యాటకులకు ముందుగా కనువిందు చేస్తాయి. పార్క్లో ఉండే జింకలకు గడ్డితోపాటు తాటి చెట్టు కర్ర తొట్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో  జింకలకు 120 కేజీల గడ్డిని పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీర్ పార్క్ 40 జింకలు మాత్రమే సరిపోతుంది. కానీ స్థాయికి మించి జింకలు ఉన్నాయి.


కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని నదికి సమీపంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కిన్నెరసాని నది గోదావరి నదికి ముఖ్యమైన ఉపనది. కిన్నెరసాని నది వెంబడి ప్రకృతి సృష్టించిన ప్రతిదృశ్యం పచ్చని విశాలమైన దృశ్యంతో నిండిపోయింది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పాల్వొంచ మండలం యానంబోయిల్ గ్రామం వద్ద కిన్నెరసాని నదిపై నిర్మించిన నిల్వ రిజర్వాయర్. 5.58 కోట్లు వెచ్చించి ఈ రిజర్వాయర్ని పూర్తి చేశారు. 1966 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. ఇది రైతులకు సాగునీటి సౌకర్యం మరియు థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి పాల్వంచ వద్ద K T P S కు నీరు అందిస్తుంది. డ్యామ్ పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవల్ 407 అడుగుల వద్ద 233 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.

కిన్నెరసాని నది తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దట్టమైన అడవులతో మరియు చుట్టూ అద్భుతమైన కొండలతో ఉంది. నది దండకారణ్య అరణ్యం గుండా ప్రవహిస్తుంది మరియు రిజర్వాయర్ 635 చదరపు కిలోమీటర్లు వన్యప్రాణులతో నిండి ఉండే ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఆనకట్ట కొత్తగూడెం నుండి 24 కిలోమీటర్ల దూరంలో మరియు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉన్న పాల్వంచ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అటవీ శాఖ ఆనకట్టకు ఎదురుగా జింకల పార్కును అభివృద్ధి చేసింది. కిన్నెరసాని అభయారణ్యం వన్యప్రాణుల స్వర్గధామం. ఈ నది కిన్నెరసాని అభయారణ్యాన్ని చీల్చి చివరకు గోదావరి నదిలో కలుస్తుంది. ఈ అభయారణ్యం మచ్చల జింకలు, చింకరా జింకలు, అడవి పందులు, నాలుగు కొమ్ముల జింకలు, సాంబార్, అడవి దున్నలు, హైనా, నక్కలు, ఎలుగుబంటి జాతులు, టైగర్స్, చిరుతలు మరియు కృష్ణ జింకలకు నిలయం. నెమలి, పిట్టలు, నుక్తాలు, స్పూన్‌బిల్లు, జంగిల్ ఫౌల్ మరియు పావురాలు ఈ డ్యామ్ ద్వారా సృష్టించబడిన అభయారణ్యంలో కనిపించే సాధారణ పక్షులు. రిజర్వాయర్ మరియు కిన్నెరసాని ద్వీపంలో కూడా మొసళ్ళు సంతానోత్పత్తి చేస్తాయి. సింగరేణి యాజమాన్యం ఇక్కడ గ్లాస్ రెస్ట్ హౌస్ను నిర్మించింది, అది పర్యాటకులు బుక్ చేసుకోవచ్చు. పర్యాటకులు హైదరాబాద్ నుండి 288 కిలోమీటర్లు, ఖమ్మం నుండి 95 కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి 165 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో డ్యామ్ చేరుకోవచ్చు. కొత్తగూడెం సమీప రైల్వే స్టేషన్.

పాపికొండల నుండి జయశంకర్ జిల్లాలోని అటవీ ప్రాంతం వరకు విస్తరించివున్న కిన్నెరసాని అభయారణ్యం 1977లో 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. టేకు, మద్ది, వెదురు వంటి వృక్షాలు పెరుగుతున్న ఈ అభయారణ్యంలో చిరుత, ఎలుగుబంట్లు, మనుబోతులు, మచ్చలజింక, సింహాలు, కృష్ణ జింకలు, అడవి పందులు, నక్కలు, హైనాలు, సరీసృపాలు, తుట్టె పురుగులు, గుర్రాలు, కొంగలు, కింగ్ఫిషర్, గిజిగాడు మొదలైన పక్షులు నివసిస్తున్నాయి.

2000లో తొమ్మిది పులులు ఉండగా, 2012కి మూడు, 2016కి ఆ సంఖ్య రెండుకు చేరింది. 2000లో ఇరవైతొమ్మిది చిరుత పులులు ఉండగా, 2012కి పదహారు, 2016కి పన్నెండు చిరుతలు మిగిలాయి. కృష్ణజింకలు, నెమళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇక్కడి మొసళ్ళు హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శనశాలకు తరలించబడ్డాయి. ప్రస్తుతం ఈ జలాశయంలో వేల సంఖ్యల్లో మొసళ్లున్నాయి. పర్యాటకులను ఆకర్షించడంకోసం 2017లో మూడు లక్షల రూపాలతో రెండు నల్లరంగు హంసలను తీసుకొచ్చారు.


Share:

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

You may also like

Search This Website

Popular Articles

Featured Post

The most expensive divorces of Bollywood (B-Town)

Many superstars frequently tilted that it's tough to have a stable private life when you work in the movie professional, and when your ...

Total Pageviews

Popular Posts