History of Wanaparthy Palace - వనపర్తి సంస్థానం గడికోట - Wanaparti Samsthanam History in Telugu


దక్కను సామ్రాజ్యంలో నిజాం పరిపాలనకు ముందు నుండి అంటే గోల్కొండ నవాబుల కాలం నుండి తెలంగాణలో దోమకొండ, బండలింగాపూర్, గద్వాల లాంటి తొమ్మిది సంస్థానాలు మనుగడలో వున్నాయి. ఈ సంస్థానాలన్నీ స్వాతంత్య్రంగానే ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిపాలనను కొనసాగించాయి. ప్రజల నుండి అన్ని రకాలయిన పన్నులు వసూలు చేసే అధికారం పూర్తిగా సంస్థానాధీశులకే వుండేది. అసఫ్జాహీల పాలనలో కూడా సంస్థానాధీశులు వారితో మంచి సంబంధాలు కొనసాగించడంతో నిజాం రాజు వారి అధికారాలను తగ్గించలేదు, వారిని కదిలించలేదు. నిజాంకు కట్టాల్సిన కప్పాన్ని టంచనుగా ఏయేటికాయేడు వారు కట్టడం వల్ల ప్రత్యేక పోలీస్, రెవెన్యూ పాలనకు సంబంధించిన ముఖ్య అధికారాలన్నీ వారి చేతుల్లోనే వుండేవి. ‘వనపర్తి’ సంస్థానం నిజాం రాజ్యంలోని అన్ని సంస్థానాల్లోకెల్లా అత్యంత కీలక సంస్థానం. మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కీర్తి కిరీటం.

ఐదువందల సంవత్సరాల గొప్ప వైభవోపేతమైన చరిత్రను తనలో ఇముడ్చుకున్న వనపర్తి సంస్థానంలో పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం, పెద్దగూడెం, వెంకటాపురం, జంగమాయి సహా నూటడేబ్బైయేనిమిది గ్రామాలు వుండేవి. కొన్ని వందల సంవత్సరాల పాటు సంస్థానంగా వున్నా పద్దెనిమిది వందల యేడులోనే ‘వనపర్తి’ జిల్లాకు మూలకేంద్రంగా మారింది. అంత కంటే ముందు ఈ సంస్థానంలో పాతపల్లె, సూగూరు, కొత్తకోట, శ్రీరంగపురం లాంటి గ్రామాలు మూలకేంద్రాలుగా వున్నాయి. ఈ సంస్థానాధీశులు ‘వనపర్తి’ని కేంద్రంగా మార్చుకున్న తరువాత ఇక్కడ పెద్ద గడి లాంటి కోటను వారి సామ్రాజ్య సంరక్షణకై నిర్మించుకున్నారు. అదే ‘వనపర్తి గడికోట’. పందోమ్మిదివందల నలబైయేనిమిది నాటికే వనపర్తి సంస్థానం ఆరువందల ఐదు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వుండేదంటే ఆ సంస్థానం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. నూటడేబ్బైయెనిమిది గ్రామాలకు మూల కేంద్రమైన ఈ సంస్థానానికి ఉత్తరాన నిజాం పాలనకిందవున్న నాగర్కర్నూల్ ప్రాంతం, తూర్పున జటప్రోలు సంస్థానం, పడమట అమరచింత సంస్థానం, దక్షిణాన కృష్ణానది సరిహద్దులుగా వుండేవి.

వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి, ఆయనకి ముగ్గురు భార్యలు. వారి వల్ల కలిగిన సంతానం ఆరుగురు కుమారులు. ఆయన తరువాత ఆయన పెద్ద కుమారుడు వెంకట కుమార గోపాలరావు సంస్థాన ధీశుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కాలంలో ఈ సంస్థానం విజయనగర రాజుల క్రింద వుండేది. అదే కాలంలో విజయనగర రాజుల సహాయంతో ఇబ్రహీం కులీ కుతుబ్షా గోలకొండ రాజయ్యాడు. దీంతో వనపర్తి సంస్థానం కుతుబ్షాహీల క్రిందకి వచ్చింది. వనపర్తి సంస్థానం 15వ శతాబ్ధం నుంచి పందోమ్మిదివందల నలబై యేనిమిది వరకు కుతుబ్షాహీలు, విజయనగర రాజులు, మొగలులు, నిజాం రాజుల పరిపాలనలో కొనసాగిందని చరిత్రకారుల కథనం.

www.akbarphotography.in
పదహారువందల ఎనబై యేనిమిది లో ఈ సంస్థానాన్ని పాలించిన మొదటి రాణి జొన్నమందళ సుగూరు నుండి కొత్తకోటకు తన సంస్థానాన్ని మార్చింది. తరువాత పదిహేడువందల యాబై నుండి పద్దెనిమిదివందల ఏడు వరకు శ్రీరంగపురం కేంద్రంగా ఈ సంస్థాన పాలన కొనసాగింది. పద్దెనిమిదివందల ఏడు లో రామకృష్ణారావు శ్రీరంగపురం నుండి సంస్థానాన్ని వనపర్తికి మార్చాడు. అలా పాలన మారిన ప్రతి కేంద్రంలోనూ వారు గడిలను నిర్మించుకుంటూ వచ్చారు. అన్నింటిలోకి ‘వనపర్తి గడి’ అతి పెద్దది. తెలంగాణలో ప్రతి గడికి ఒక చరిత్ర వుంది. సంస్థానాధీశులు, దొరలు, దేశ్ముఖ్లు ఎవరి ప్రాంతాల్లో వారు గడీలను అత్యంత పటిష్టంగా నిర్మించుకున్నారు. ఒక కట్టడానికి మరొక దానితో పోలిక వుండదు. ఎవరికి నచ్చినట్లు వారు గడీలను నిర్మించుకున్నారు. కొందరు సంస్థానాధీశులు తమ వైభవాన్ని ప్రదర్శించడానికి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఇతర దేశాల ఆర్కిటెక్చర్స్తో గడీలను నిర్మించారు. మరికొందరు ఇతర ప్రాంతాల నమూనాలను చూసి నిర్మాణాలు చేపట్టారు. అలా చేసిన గొప్ప నిర్మాణమే ‘వనపర్తి గడి’. వనపర్తి గడి నిర్మాణాన్ని పద్దెనిమిదివందల అరవై యెనిమిదిలో జొన్నమందళ దొరసాని చేపట్టింది. పద్దెనిమిదివందల ఏడు లో రాజధానిని వనపర్తికి మార్చిన తరువాత ఇక్కడ ఒక గడి వుండాలని ఆమె నిర్ణయించుకుంది. ఇలాంటి నిర్మాణాలు ఏవి చేపట్టాలన్నా ముందుగా డంగుతో సున్నం తయారు చేయాలి. డంగు సున్నాన్ని తయారు చేసే ప్రక్రియలో వారు ఎడ్లతో మట్టిని రోజుల తరబడి త్రొక్కించేవారు. ఈ ఆనవాళ్ళు మనకు ఇప్పటికీ వనపర్తి గడిలో కనిపిస్తాయి. ఆనాటి కాలపు డంగు బట్టీలు ఇప్పటికీ వనపర్తిలో మనం చూడవచ్చు. వనపర్తి సంస్థానంలోకి వెళ్ళే ముందుగానే మనకు ఒక పెద్ద కమాను కనిపిస్తుంది. దానిపై వనపర్తి రాజులకు సంబంధించిన రాజ ముద్రలుంటాయి. ఈ గడి నిర్మాణ క్రమంలో అణువణువునా వారు తీసుకున్న శ్రద్ధ, ఆసక్తి కనిపిస్తాయి. అత్యంత పటిష్టంగా, శతృదుర్భేద్యంగా కోటలా నిర్మించిన ఈ గడిలోకి వెళ్ళడానికి నిర్మించిన కమానును దాటిన తరవాత మనకు అతి పెద్ద భవంతి కనిపిస్తుంది. దీనినే రంగుమహల్ అంటారు. ఆ రోజుల్లో సంస్థానంలోని ఆస్థాన కవులు దీని గురించి తమ రచనలలో గొప్పగా వర్ణించిన దాఖలాలు వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ భవంతిని 10 అడుగుల ఎత్తులో కట్టారు. గడి లోపలికి వెళ్ళటానికి రెండు వైపులా రాజమార్గాలున్నాయి. వాటికి ఇరువైపులా రాజ సింహాలు ఠీవీగా వుంటాయి. ఆ సింహాలను చూస్తే నాటి సంస్థానాధీశులు ఎంతటి దర్పంతో ఇక్కడి నుండి పాలన సాగించారో బోధపడుతుంది.

www.akbarphotography.in
గడి మొదటి అంతస్తులో ఒక విశాలమైన టెర్రస్ వంటి నిర్మాణముంటుంది. ఇక్కడి నుంచే రాజులు ప్రజలనుద్ధేశించి ప్రసంగించేవారు. భారత దేశపు మొదటి ప్రధాని జవహన్లాల్ నెహ్రూ కూడా ఇక్కడి నుండే తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ రెండు అంతస్తుల గడి నిర్మాణం ఒక అద్భుత నిర్మాణంలా వుంటుంది. ప్రతి అంతస్తులోపల చెక్క మెట్ల నిర్మాణం వుంటుంది. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మొదటి అంతస్తు నుండి చూస్తే మొత్తం గడి ప్రాంతం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి ప్రాంతమంతా అందమైన పెయింటింగ్తో వివిధ రకాల ఆర్కిటెక్చర్ డిజైనింగ్తో ఎక్కడికక్కడ చూపరులని అబ్బురపరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. గాలి, వెలుతురుకి ఏమాత్రం ఇబ్బంది వుండకుండా తలుపులను వరుసగా అమర్చుతూ వాటికి తగ్గట్టుగా గదుల నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్మాణ చాతుర్యం మనకు నేటికీ కనిపిస్తుంది. బయటికి గడి ఎంత అందంగా వుంటుందో, లోపల కూడా అంతే రాజసంగా అందంగా కనిపిస్తుంది. అణువణువునా ఆనాటి రాజుల, దొరల దర్పం మనకు ఆ నిర్మాణ తీరుల్లోనే కనిపిస్తాయి. గడి ప్రాంగణంలో ఒక మందిరంతోపాటు వివిధ రకాల ఇతర నిర్మాణాలు సహితం మనకు కనిపిస్తాయి. అలాంటి వాటిలో రాణీమహల్ ఒకటి. ఆర్కిటెక్చర్ పరంగా దీనికి ప్రత్యేకత ఎక్కువగా లేకపోయినా, చరిత్రలో రాణీమహల్కి ప్రాధాన్యముంది. ఇలాంటి నిర్మాణాలు గడి చుట్టూ మనకి ఎన్నో కనిపిస్తాయి. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో వారసత్వాలపై కొన్ని వివాదాలున్నాయి.

వీటిని పరిష్కరించే దిశగా నిజాం రాజు ఆనాడే ఒక కమీషన్ ఏర్పాటు చేశారంటే వారి మధ్య గొడవలు ఏ స్థాయిలో వుండేవో మనం అర్థం చేసుకోవచ్చు. సంస్థానం పాలనా వ్యవహారాల్లో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. అసలు గడీల పునాదికి సంబంధించి మహిళలే తమ ఆలోచనల్ని అమలుపరిచేవారు. మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ సంస్థానాధీశుల్లో సగం మంది దత్తతగా వచ్చిన వారే. సవై వెంకటరెడ్డి, నాలుగో వెంకటరెడ్డి, గోపాలరావు, మొదటి రామకృష్ణారావు, మొదటి రామేశ్వర్ రావు, రెండవ రామేశ్వరరావు లాంటి వారంతా దత్తతగా వచ్చినవారే. రెండువందల సంవత్సరాలపాటు సాగిన సంస్థాన పాలనలో సగం మంది సంస్థానాధీశులు దత్తతగా వచ్చిన వారే. ఈ సంస్థానాధీశులు కవులను, తెలుగు సాహిత్యాన్ని, బ్రాహ్మణులను బాగా ప్రోత్సహించి గౌరవించేవారు. బ్రాహ్మణులను గౌరవించటం అంటే సాక్షాత్తూ దేవుళ్ళను పూజించటం వంటిదని వారు భావించేవారు. దానికి తగ్గట్లే బ్రాహ్మణులు యజ్ఞ యాగాది కార్యాలను నిర్వహిస్తూ పాలనలో వారికి మంచి సూచనలు అందిస్తూ వుండేవారు. అలాగే ప్రతియేటా కవి సమ్మేళనాలను నిర్వహించడమేగాక, ఆ సందర్భంలోనే బ్రాహ్మణులను, కవులను సత్కరించేవారు. మరో విశేషమేమిటంటే ‘ఓరియెంట్ ఇంగ్లీష్ లాంగ్ మ్యాన్’ స్కూళ్ళను స్వయంగా సంస్థానాధీశులు నడిపేవారంటే వారు ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించే వారని తెలుస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన మొదటి రోజుల్లో ‘ఓరియెంట్ లాంగ్ మ్యాన్ (లండన్) కంపెనీని రాజా రామేశ్వర రావు స్వయంగా నడిపారు.

www.akbarphotography.in
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇక్కడే నాటి సంస్థానాధీశులు స్వయంగా ప్రచురించి ముద్రించిన పుస్తకాల సమాహారంతో అనేక విలువైన గ్రంధాలను ఒక లైబ్రరీలో భద్రపర్చటం మనకు కనిపిస్తుంది. ఇప్పటికి ఇది నడుస్తోంది. పందోమ్మిదివందల నలబై యేనిమిది తరువాత వనపర్తి గడి పాలిటెక్నిక్ కాలేజ్గా మార్చబడింది. ప్రస్తుత పరిస్థితుల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల పిల్లలు ఇక్కడే చదువులు నేర్చుకుంటున్నారు. రెండువందల సంవత్సరాలపాటు ఈ ప్రాంత పాలనను కొనసాగించిన గడి విద్యాలయంగా మార్చబడటంవెనుక వనపర్తి పాలకుల కృషి అద్భుతమని స్థానికులు చెబుతున్నారు.

పందోమ్మిదివందల యాబైతొమ్మిది అక్టోబర్ 11న జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో వనపర్తి సంస్థానానికి చెందిన ఈ గడిని పాలిటెక్నిక్ కాలేజ్గా మార్చారు. వాటికి సంబంధించిన శిలాఫలకాలు నేటికీ లభ్యమవుతాయి. సంవత్సరానికి రెండు లక్షల కప్పం వనపర్తి సంస్థానాధీశులు నిజాం ప్రభుత్వానికి కట్టేవారు. ఈ సంస్థానం కాలేజ్గా మారే ముందు పందోమ్మిదివందల నలబై యేనిమిది వరకు స్కూల్గా వుండేది. వనపర్తి సంస్థానానికి చెందిన ఈ గడి ఒక రకంగా వారసత్వ సంపదే అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడికి అవసరమైన మార్పులు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచి నాటి పాలకుల పాలనా విశేషాలు తెలియజేసే మ్యూజియంగా మారిస్తే భావి తరాల వారికి తెలంగాణ ప్రాంతంలో గత కాలపు వైభవం, పరిస్థితులు అందరికీ తెలియజేసిన వాళ్ళమవుతాం. వనపర్తి సంస్థానాన్ని టూరిస్టు కేంద్రంగా అభివృద్ధిపరిస్తే పర్యాటకులతో ఈ ప్రాంతం కళకళ లాడుతుంది.

Search Website

Featured Post

10 Tourist Places to Visit in Coorg - తెలుగులో కూర్గ్ ట్రిప్ - Scotland of India

Click for  English Version -   కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవు ఇప్పుడు మీరు చదవబోయె ప్రాంతం. ఇక్కడి లోయల్ని, కొండ ...

Popular Articles