శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు ఈ డయాబెటిస్ సమస్య వస్తుంది. ప్రపంచంలోనే 7.7 కోట్ల మంది మధుమేహ రోగులతో భారతదేశం రెండో స్థానంలో ఉందంటే ఈ వ్యాధి ప్రభావం ఏ మేర వ్యాపించి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తుంది. మూడింట ఒక వంతు డయాబెటిస్ పేషంట్‌లు మూత్రపిండాల వ్యాధిని సైతం ఎదుర్కొంటున్నారు.
మధుమేహం యొక్క రకాలు
ఇందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి
టైప్-1 డయాబెటిస్: మానవ శరీరంలోని క్లోమ గ్రంధి (Pancreas) లో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ ఈ గ్రంధిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను (బీటా కణాలు) నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి మధుమేహం వచ్చే సూచనలు కనిపిస్తే దాన్ని టైప్-1 డయాబెటిస్ అంటారు. అయితే ఇది ఎక్కువగా 10 నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లల్లో, యువకుల్లో సర్వసాధారణంగా వస్తుంది.
టైప్-2 డయాబెటిస్: శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడానికి క్లోమ గ్రంధి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే క్లోమ గ్రంధి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోయినా లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయినా టైప్-2 డయాబెటిస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా 30 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో వస్తుంటుంది.
డయాబెటిస్ లో జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్) అనే మరో రకం కూడా ఉంటుంది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో వచ్చే మధుమేహాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. గర్భంలో ఉన్న శిశువుకు అవసరమైనంత ఇన్సులిన్‌ను గర్భిణి శరీరం ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 6 నుంచి 16 శాతం మంది గర్భిణుల్లో వచ్చి ప్రసవం తర్వాత తగ్గిపోతుంది.
శరీరంలో షుగర్ లెవల్స్ ఎంత ఉండాలి?
రోజు మనం తీసుకునే ఆహారం మనకు శక్తికి ప్రధాన వనరు అయిన గ్లూకోజ్‌ని అందిస్తాయి. అయితే శరీరంలో ఉండే షుగర్ లెవల్స్ ఎప్పుడైతే ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉంటాయో వారు డయాబెటిస్‌ని కల్గి ఉన్నారని చెబుతారు. ఈ చక్కెర స్దాయిలను నిర్ధారించడానికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేస్తారు. అంటే, ఉదయం పరగడపున బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ 99 mg/dl లోపు ఉండాలి. అయితే ఈ స్థాయి 100-125 mg/dl చేరితే ప్రీ డయాబెటిస్ అని, 126 mg/dl పైన ఉంటే మధుమేహం (డయాబెటిస్) ఉన్నట్లుగా నిర్దారిస్తారు.
HbA1C లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని కూడా పిలువబడే ఈ పరీక్ష ద్వారా కూడా డయాబెటిక్ స్థాయిల గురించి తెలుసుకోవచ్చు. సాధారణంగా HbA1C స్థాయిలు 5.7% లోపు ఉండాలి. అదే HbA1C స్థాయిలు 5.7% నుంచి 6.4% మధ్య ఉంటే దానిని ప్రీ డయాబెటిస్ అనవచ్చు. అదే 6.5% లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు ఉంటే ఇప్పటికే వారు డయాబెటిస్ ను కలిగి
డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలు
శరీరం గ్లూకోస్ ను గ్రహించే స్థాయిని కోల్పోవడమే డయాబెటిస్ కు ముఖ్య కారణం.
- అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం
- పనిలో ఒత్తిడికి గురవ్వడం మరియు శారీరక వ్యాయామం లేకపోవడం
- అధిక పని గంటలు, వివిధ షిఫ్టులలో పని చేయడం
- అధికంగా పొగ తాగడం, మద్యపానం సేవించడం
- అధిక బరువు మరియు ఊబకాయం తో బాధపడే వారిలోనూ మరియు విటమిన్-డి లోపం వల్ల కూడా ఈ డయాబెటిస్ సమస్య వస్తుంది
డయాబెటిస్ వల్ల కలిగే ప్రమాదాలు
మధుమేహం వచ్చాక మొదటి 10 సంవత్సరాలు ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో కొందరు అశ్రద్ధ వహిస్తుంటారు. అయితే ఇది శరీరంలోని ఏదో ఒక ఆర్గాన్ మీద చాలా తీవ్రంగా ప్రభావం చూపిన తరువాత తగు పరీక్షలు చేసినప్పుడు మాత్రమే మధుమేహం బారిన పడినట్లు తెలుస్తుంది.- రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు పెరగడంతో కాళ్లు, చేతులకు సరిగా రక్త సరఫరా కాక రక్త నాళాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది
- పాదాలకు ఇన్ఫెక్షన్ లు కలుగుతాయి
- కంటి చూపు కోల్పోడమే కాక మూత్ర పిండాలు కూడా సరిగ్గా పని చేయవు
- గుండె పోటు వంటి అనారోగ్య సమస్యలు రావడానికి ఈ డయాబెటిస్ ప్రధాన కారణం అవుతుంది
డయాబెటిస్ లక్షణాలు
వ్యక్తుల బ్లడ్ షుగర్ ఎంత వరకు పెరిగిందనే దానిపై ఆధారపడి మధుమేహం లక్షణాలు మారుతూ ఉంటాయి.- ఏ పనీ చేయకపోయినా నీరసంగా (అలసిపోయినట్లు) ఉండడం
- నోట్లో పుండ్లు ఏర్పడటం
- ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం
- శరీరంపై గాయాలు త్వరగా మానకపోవడం
- ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం
- ఎక్కువగా దాహం వేయడం
- కంటిచూపు మందగించడం
- విపరీతమైన ఆకలి అనిపించడం
- చిగుళ్ల వ్యాధులు, వజైనల్ ఇన్‌ఫెక్షన్స్, చర్మ వ్యాధులు వంటి వాటికి తరచుగా గురి అవ్వడం
డయాబెటిస్ నియంత్రణకు తీసుకోవాల్సిన ఆహారాలు
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకునే ఆహారంపై కూడా ఎంతో జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది.- ఆహారంలో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పదార్థాలను తక్కువ మోతాదు లో తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చు
- అధిక పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి
- కార్బోహైడ్రేట్లు లేని ఆరెంజ్, పుచ్చకాయ, జామకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి
- ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి
- ఆకుకూరలు, చిరుధాన్యాలు, బాదాం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి
- వారానికి రెండు సార్లు ఉపవాసం చేయడం కూడా మధుమేహనికి ఉత్తమ చికిత్సగా చెప్పవచ్చు
డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారాలు
- చక్కెరతో చేసిన స్వీట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, కేకులు వంటి ప్రొసెస్డ్ ఆహారాలకు దూరంగా ఉండాలి
- చక్కెర బదులు బెల్లంను వాడడం కూడా మంచిది కాదు
- తేనేను తీసుకోవడం కూడా తగ్గించాలి
- బంగాళదుంప మరియు తియ్యటి బంగాళదుంప వాటికి దూరంగా ఉండాలి
- కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకూడదు
- అరటి, మామిడి, సపోట, శీతాఫలం, ద్రాక్ష, పనస వంటి పండ్లకు దూరంగా ఉండాలి
కొందరు డయాబెటిస్ నియంత్రణలోకి రాగానే ముందు పాటించిన అలవాట్లను విస్మరిస్తుంటారు. దీంతో వారిలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగి ప్రాణాంతకమైన సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా రక్త పరీక్షలు చేయించుకుంటూ మధుమేహ స్థాయిలు తెలుసుకుంటూ ఉండాలి. సమయానికి సరైన డైట్ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ మధుమేహం బారిన పడకుండా కొంత మేర కాపాడుకోవచ్చు.
#WorldDiabetesDay #DiabetesAwareness #TeluguHealth #DiabetesPrevention #HealthTips #DiabetesTypes #HealthyLiving #Wellness #Healthcare #November14
Content Courtesy: Yashoda Hospitals