What is Raman Effect in Telugu - Short Biography of Sir C V Raman in Telugu - National Science Day 28th Feb


👉సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది..?ఆకాశం నీలి రంగులోనే ఎందుకుంటుంది. పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు.? అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి..? ఎన్నో ప్రశ్నలు,మరెన్నో ఆసక్తికర అంశాలు..వీటన్నింటికీ సమాధానం సివి రామన్ కనుగొన్న సూత్రాలే ప్రామాణికం. సైన్సు రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ ను శక్తివంతగా చూపించారు. ఆప్పట్లోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్. ఆయన రామ‌న్ ఎఫెక్ట్ క‌నిపెట్టిన రోజునే దేశంలో జాతీయ సైన్స్ దినోత్స‌వం(నేష‌న‌ల్ సైన్స్ డే)గా జ‌రుపుకుంటున్నారు.

👉వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్ బహుమతి పొందిన కాంతి పుంజం. దేశంలో రెండవ నోబెల్ పొందిన మహనీయుడు, అంతేకాదు ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటి వ్యక్తి. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సీవీ రామన్. నవంబర్ 7, 1888 తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ వెంకట రామన్ జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది.

👉రామన్ తన 13 వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీలో 1902 లో ప్రవేశించి, 1904 లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందాడు. 1907 లో అదే కాలేజీ నుండి యం.ఏ. డిగ్రీని ఫిజిక్స్ లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు. అలా అనుమతి పొందిన తరువాత పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్ కు రామణ్ వెళ్ళేవారు. వారాంతారాలు, సెలవులు ఇలా ఎలాంటి వెసులుబాటు దొరికినా ఎక్కువగా పరిశోధనలతోనే గడిపాడు. తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించాడంటే ఆయనకు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోచ్చు అతని తల్లి పార్వతి అమ్మాళ్కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921 లో లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా ఏంటి అని వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది.

👉సముద్రంలో నీరు నీలి రంగులో ఎందుకుందంటూ సీ. వి. రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం. అనేక అద్భుతాలకు వేదికగా నిలిచిన ప్రయోగం. ఈ విషయంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాల ఆధారంగానే ఆయనకు నొబెల్ బహుమతి వరించింది. అంతే కాదు భారతరత్న అవార్డు కూడా ఆయన ఖాతాలో చేరింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించారు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్.కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్, అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్లు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు.

👉ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుందని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు. వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రామన్ ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954 లో 'భార తరత్న' బిరుదు ఇచ్చింది. 1957 లో సోవియట్ యూనియన్ 'లెనిన్ బహుమతి'తో సత్కరించింది. విదేశాలలో ఎన్నో అవకాశాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి సివిరామన్ ఎన్నో విజయాలు సాధించారు.

👉భారతరత్న అందుకున్న సమయంలో రామన్ ఇచ్చిన సందేశాత్మక ఉపన్యాసం నేటీకీ ఎంతోమందిని అలోచనలో పడేస్తోంది. విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి 'అంటూ ఆయన చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే "విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం అని రామన్ ఎప్పుడూ చెబుతుండే వారు.

👉రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు.

👉1927 సంవత్సరం భౌతిక శాస్త్రంలో కాంప్టన్ నొబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ లో సరికొత్త ఆశలను రేకెత్తించాయి. కాంప్టన్ ఫలితం ఎక్సరేయిస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంతోనే విజయం వైపు అడుగులు వేశారు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న సి.వి. రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928 సంవత్సరం, ఫిబ్రవరి 28న రామన్ మొట్టమొదటిసారి ప్రకటించారు.

👉పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు ఆవిష్కరించడం జరిగింది. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం 1929 లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ ను అభినందించారు.

👉అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924 లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1928 లో రామన్ కు సర్ బిరుదు దక్కింది. 1947 లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది. సి.వి. రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. తన అనన్య సామాన్య పరిశోధనా సామర్ధ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28 నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతీ సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారకంగా జరుపుతోంది.


👉విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబుల్ రావడం గగనం. అలాంటిది సర్ సీవి రామన్ అ ఘనత సాధించిపెట్టారు. అదీ ఆసియా ఖండం చరిత్రలోనే విజ్ఞాన శాస్త్రంలో ఆఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి రామన్. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలు వెళ్ళడమేంటీ.. విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్ రామన్ ముందువరకూ సైన్సులో నోబెల్ బహుమతులు అన్నీ తెల్ల జాతీయులైన పాశ్చాత్యులకే దక్కేవి. కాని, రామన్ నూటికి నూరుపాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో భారతీయుల శక్తిసామర్ధ్యా లను ప్రపంచానికి చాటి చెప్పి భారత్ కు నోబుల్ సాధించిపెట్టారాయన.

👉1913 లో సాహిత్యంలో మనదేశం నుండి నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ అనంతరం సైన్సు రంగంలో విజయఢంకా మ్రోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్ ఒక్కరే కావడం అందరికీ గర్వకారణం. రామన్ పరిశోధనలు సైన్సులో, పారిశ్రామిక రంగంలోనూ క్రొత్తపుంతలు త్రొక్కడానికి దారితీసింది. శాస్త్రరంగంలో రామన్ స్పెక్టో స్కోపీ ఆవిర్భావానికి భారతరత్న, 1957 లో లెనిన్ శాంతి బహుమతి లభించాయి. కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది. మనకి స్వాతంత్య్రం రాగానే రామన్ కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్ గా ప్రభుత్వం నియమించి గౌరవించింది. 1948 లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా రిటైరయ్యారు. దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపిన సి.వి. రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించాడు. వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వారు సేకరించి భద్రపరిచారు.

👉1949 లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27 న ఆయన మరణించే వరకూ, ఆ సంస్థలో పరిశోధనలు జరిపి, మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకు లయ్యారు. 1971 నవంబర్ 21 న సి.వి. రామన్ పోస్టేజి స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహా శాస్త్రజ్ఞుడిని గౌరవించింది. 1933 లో బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్ డైరెక్టరుగా వున్నప్పుడు జర్మనీ నుండి హిట్లర్ ఎంతోమంది సైన్సు నిష్ణాతులను తరిమివేసేవాడు. జాత్యహంకారంతో హిట్లర్ బాధల గాధలకు గురిచేస్తున్న నిష్ణాతులైన యూదు సైంటిస్టులను, ఇతర సైంటిస్టులను మనదేశానికి ఆహ్వానిస్తే, మనదేశం సైన్సు రంగంలో అగ్రగామి కాగలదని రామన్ ఆకాంక్షించాడు. మనదేశస్తులు విదేశాలు వెళ్ళి చదువుకొనే బదులు విదేశస్తులనే మనదేశం ఆహ్వానించాలని రామన్ అభిమతం.

👉రామన్ ఆశించినంతగా విజ్ఞానరంగంలో మనదేశం దూసుకుపోతుందా అంటే.. అంతగా లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైపల్యమేనని చెప్పాలి. పాలకులు ప్రయోగాల కోసం విధిలించే అరకొర నిధులు కారణంగా ఈ ప్రయోగాల మీద శాస్త్రవేత్త ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ శాస్త్ర సాంకేతిక రంగ స్థానం ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. సైంటిస్టులకు దేశాల సరిహద్దులు వుండవు. సైన్స్ విశ్వజనీనం. ఇది నమ్మిన రామన్ రామన్ హిట్లర్ వల్ల హింసకు గురియైన, అవమానపడ్డ కొందరు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞులను వచ్చి మనదేశంలో స్థిరపడమని, యిక్కడ పరిశోధన కొనసాగించమని ఆహ్వానించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని హర్షించకపోగా, సి.వి. రామన్ ను టాటా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ పదవి నుండి తొలగించింది.

👉ఆ సంఘటన రామన్ లో పట్టుదల, దీక్షను మరింత పెంచింది. సైన్స్ రంగంలో మనదేశం స్వయం సంపూర్ణం కావాలని వివిధ రంగాలలో తన కృషిని కొనసాగించారు. తన తలపాగాను తియ్యలేదు. విదేశస్తుల ముందు తలవంచలేదు. సైన్సు పరిశోధనల ద్వారానే మనదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి కాగలదని రామన్ స్పష్టంగా గుర్తించారు. ఆ దిశగానే అడుగుల వేసి మన దేశాన్ని ప్రపంచపటంలో నిలిపారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటిగా సి.వి రామన్ నిలిచాడు. రామన్ తరువాత ఏ భారతీయునికి లేదా ఏ ఆసియా వాసికి భౌతిక లేదా విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి రాలేదు. భారత్లో శాస్త్ర పరిశోధనను పెంపొందించడం కోసం 1934 లో రామన్ భారత అకాడమీ ఆఫ్ సైన్స్ ను ప్రారంభించారు. మన పూర్వీకుల విజ్ఞానానికి ధీటుగా సైన్స్ ను భవిష్యత్తు తరాలకు అందించాలని అలాంటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆయన సంకల్పం. ఆ కేంద్రంలో మన మేధావులు విశ్వ రహస్యాలను ఛేదించాలన్నది ఆయన ఆకాంక్ష. రామన్ ఎఫెక్ట్ ఆసరా చేసుకుని అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. దాదాపు 1800 పరిశోధన పత్రాలు ప్రచురించబడ్డాయి. 2500 రసాయనిక సమ్మేళనాలపై అధ్యయనం జరిగింది.

👉మనదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివద్ధి ఎలా ఉందో చూస్తే చాలా విచారంగా ఉంటుంది. ఈ విషయం మనకే కాదు మన పాలకులు కూడా ఆంగీకరిస్తారు. బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక రంగాలకు నిధులు అంతంత మాత్రంగానే కేటాయిస్తుండటంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు వైపు అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 133 కోట్ల జనాభా ఉండి స్వాతంత్య్ర భారత చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పటిదాకా నోబెల్ బహుమతి పొందగలిగింది ఒక్కరే అంటే భారత్ ప్రపంచ దేశాలతో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. శాస్త్ర పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎనిమిదో స్థానంలో ఉంది. భారత దేశంలో సంవత్సరానికి 1,54,827 పరిశోధనా పత్రాలను ప్రచురిస్తుండగా ఆమెరికాలో 14,25,550 పత్రాలను ప్రచురిస్తున్నారు

Search Website

Popular Articles

Featured Post

B-Town's Costliest Divorce Settlements in Bollywood - 7 Most Expensive Divorces in Bollywood

Many superstars frequently tilted that it's tough to have a stable private life when you work in the movie professional, and when your ...